2, ఫిబ్రవరి 2016, మంగళవారం

షరతులు వర్తిస్తాయి!

మంచి సంబంధం.కట్నాల ఊసు లేదు.పిల్ల నచ్చింది."రెండు రోజుల్లో మళ్ళీ మూఢాలు వస్తాయి.కనుక,రేపే తాంబూలాలు మార్చుకుందాం" అని వియ్యాల వారి నుండి ఫోను.


ఆ యింట్లో అందరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయి పోయేరు."మా సునంద జాతకం చాలా మంచిదమ్మా" యీ మాట యిప్పటికి తల్లి సరస్వతమ్మ అనుకోవడం యిది ఏ వందో సారో. తండ్రి నారాయణ కూడా ఎంతగానో సంతోషించారు. వియ్యంకుల వారి నుండి ఫోను వచ్చింది లగాయితూ ఆ దంపతులకి కాలు ఒక చోట నిలవడం లేదు. చుట్ట పక్కాలకి ఉదయం నుండి ఫోన్లు చేస్తూ ఆ శుభ వార్త అందజేస్తూనే ఉన్నారు. ఇరుగు పొరుగులకీ,ఊళ్ళో స్నేహితులకీ ఆ వార్త చేర వేసారు. మరో ప్రక్క తాంబూలాలు యిచ్చుకుందుకి అట్టే వ్యవధి లేక పోవడంతో వాళ్ళకి కంగారు పెరిగిపోతోంది. పీకల మీదకి యీ మూఢాలొకటి వచ్చి పడుతున్నాయి. ఏం చెయ్యాలో తోచడం లేదు. తాంబూలాలకి కొంచెం సమయం కావాలని అడిగే సాహసం చేయ లేక పోయేరు.


సునంద కూడా యీ సంబంధానికి సుముఖత తెలియ జేసింది. అయితే యింత అవ్యవధానంగా నిశ్చయ తాంబూలాలు ఏర్పాటు చెయ్య మనడం ఆమెకి చిరాకనిపిస్తోంది."మరో సారి వాళ్ళతో మాట్లాడ కూడదూ, నాన్నా..."అంది తండ్రితో. అతను ఫోను చేసారు.


"అబ్బే...అనుకున్నాక మరి ఆలస్యమెందుకండీ...బావ గారూ...మూఢాలు రాకుండానే ఆ తంతు జరిపించేద్దాం...మాట్లాడుకోడానికి మరేం లేదు.. అదీ కాక, మా వాడికి యిప్పట్లో మళ్ళీ సెలవు దొరకదు . తాంబూలాల కార్యక్రమం చాలా సింపులుగా జరిసించేద్దాం...కాదనకండి..." అని జవాబొచ్చింది.


మరి చేసేదేముంది కనుక? హడావిడిగా పనులకి సిద్ధమయ్యారు నారాయణ దంపతులు.


కట్నం ప్రసక్తి లేని సంబంధం వొచ్చినందుకు సునంద ఎంతగానో ఆనందించింది. అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తున్నా కట్నం కోసం వేధించే వారున్న యీ రోజులలో ...ఆ ఊసే ఎత్తని వారి ఉత్తమ సంస్కారానికి పొంగి పోయింది. ఆ రోజంతా షాపింగ్ చేసి, బట్టలూ, ప్వీట్లూ అవీ కొని, బిజీ బిజీ అయి పోయేరు నారాయణ దంపతులు. వియ్యాల వారిదీ అదే ఊరు కావడం చేత, ప్రయాణ హడావిడి లేదు. దగ్గరి వాళ్ళకి ఫోన్లు చేసి ఆహ్వానించారు.


మర్నాడు నిశ్చయ తాంబూలాల కార్యకమం నిరాడంబరంగానే, అయినా, ఎంతో ఉల్లాసంగా జరిగింది. కొద్ది పాటి మంది బంధువులూ, స్నేహితులూ హాజరై దీవించేరు. ఫొటోలూ, వీడియోలూ షరా మామూలే...


మూఢం వెళ్ళేక ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నారు. వియ్యాల వారు వెళ్ళి పోయేక ఆ రాత్రంతా సరదా కబుర్లతోనే గడిచి పోయింది.
కట్నం లేని సంబంధం వొచ్చినందుకు నారాయణ గర్వించేడు.


* * * * * *


"సునందది మహర్జాతకం..." అనుకున్నాడు నారాయణ.
"అవును సుమీ..." అనుకుంది సరస్వతమ్మ.


కాని, ఆ సంతోషం అట్టే రోజులు వారికిొ నిలవ లేదు.


మూఢాలు వెళ్ళేక, పెళ్ళి ముహూర్తాలు పెట్టుకున్నది లగాయితూ వారి ఆనందం అడుగంటి పోసాగింది. వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెట్టించే సంఘటనలు చాలానే జరిగాయి...


వియ్యాల వారి నుండి రోజుకో ఫోను. పూటకో బెత్తాయింపు.కట్నం లేదు కనుక, పెళ్ళి మాత్రం ఆ పట్నంలోకెల్లా అత్యంత విలాసవంతమయిన హొటల్లో జరిపించాలని హుకుం జారీ చేసేరు. తమ తరఫు వాళ్ళెవరి వద్దా చిన్నపోకుండా పెట్టుపోతలూ అవీ ఘనంగా జరిపించాలని తేల్చి చెప్పారు. ఆ బట్టల ఖరీదులూ,వివరాలూ విని నారాయణ దంపతులకి గుండెలు జారి పోయేయి. ఇక,పెళ్ళి కూతురుకి పెట్ట వలసిన నగల గురించి విన్నాక,వారికి మూర్ఛ వచ్చినంత పనయింది. కళ్ళు బైర్లు కమ్మాయి.సారె సామాన్ల జాబితా, విందు భోజనాలలో మెనూ, పెళ్ళయాక నూతన దంపతుల హనీమూను ట్రిప్పు కోపం చేయాల్సిన యేర్పాట్లూ,.. ఇవన్నీ క్రమేపీ ఒక్కొక్కటీ వింటూ వాళ్ళ మెదళ్ళు మొద్దుబారి పోయాయి.


వియ్యాల వారి నుండి ఫోనంటేనే బెంబేలెత్తి పోతున్నారు. వారికి ముచ్చెమటలు పడుతున్నాయి.


కట్నం లేదన్న మాటే కానీ, ఆ గొంతెమ్మ కోరికలకి అంతూ పొంతూ లేకుండా పోతోంది. ట్రింగ్ ....ట్రింగ్ ... అనే ఫోను శబ్దం వాళ్ళ గొంతు తడారి పోయేలా చేస్తోంది.


కట్నం తీసుకోని కీర్తి వాళ్ళకి దక్కొచ్చు కాక, ఈ పెళ్ళి యేర్పాట్లతో తాము కుదేలయి పోవడం తధ్యం... సునంద కోపంతో చిందు లేస్తోంది. ఒక దశలో ఈ సంబంధం కేన్సిలు చేసెయ్యమని తెగేసి చెప్పింది.


అంత వరకూ వచ్చేక ఎలా వదులు కోవడం? అల్లుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మనిషి యోగ్యుడులాగే ఉన్నాడు. అయినా, పెళ్ళి ఘనంగా జరగాలని వారను కోవడంలో తప్పేమీ లేదు... కానీ, ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా... అప్పుడు తను తూగగలడో లేదో ముందే వారికి చెప్పుకునే వాడు కదా...పెళ్ళికి ముందే యిలాగుంటే, పెళ్ళయాక తమ తలకి మించిన కోరికలు ఏం కోరుతారో....అదో బెంగ వారిని పీడించ సాగింది.


గొప్పగా ... మాట్లాడు కోడానికి ఏమీ లేదని చెప్పి, తాంబూలాలకి తొందర పెట్టి, తీరా యిప్పుడీ గొంతెమ్మ కోరికలతో చంపుతున్నారు...


వీళ్ళ ఆరాటం గమనించి , తెలిసిన స్నేహితుడొకాయన సలహా యిచ్చేడు ‘‘ కొందరంతే ...అన్నీ ఉచితం అని ప్రకటనలిచ్చి...చివర్లో ఎక్కడో కనీ కనిపించ కుండా షరతులు వర్తిస్తాయి అని వేస్తారు చూడండి... అలాగన్న మాట...పైకి సంస్కారం ప్రకటించి, తర్వాత వాళ్ళనుకున్న వన్నీ సాధిస్తారు...సరే ...అప్పో ...సప్పో చేసి, సునంద పెళ్ళి జరిపించండి ...అంతకన్నా మరో మార్గం లేదు...అన్నీ సర్దుకుంటాయి...పెద్ద వాడ్ని చెబుతున్నాను ... కాదనకండి ...’’ అని హితవు పలికారు. అయిష్టంగానే అంగీకరించేరు నారాయణ దంపతులు.


* * * * * *


పెళ్ళి మహా ఆడంబరంగా జరిగింది. చిన్నా చితకా తప్ప మరేం కొత్త కోరికలు కోర లేదు వాళ్ళు. ఆ మేరకు ... అదో ఊరట...
ఆ పెళ్ళితో ఆ దంపతులకి ఆనందంతో పాటూ పుట్టెడు అప్పూ, తెలీని బెంగా మిగిలి పోయేయి.


సునంద అత్త వారింటికి వెళ్ళి పోయింది. త్వరలోనే అందరితో బాగా కలిసి పోయింది.పదహారు రోజుల పండుగ పూర్తయేక ...సెలవు ముగించుకుని, సునంద తిరిగి తన ఉద్యోగంలో జాయనయింది రోజులు గడుస్తున్నాయి. నాలుగు నెలలయింది. సునంద తన జీతం ఏం చేస్తోందో తెలీడం లేదు. అత్త వారింటిలో ఒక్క పైసా యివ్వడం లేదు... ఆ యింట్లో అంతా మనసులోనే కుత కుత లాడి పోతున్నారు. సంస్కారపు తెర అడ్డొచ్చి, ఎవరూ నోరు మెదపడం లేదు.


ఆఖరికి ఉండబట్ట లేక, భర్తే ఓ రోజు సునందని జీతం గురించి అడిగేడు.

సునంద ప్రశాంతంగా బదులిచ్చింది."పెళ్ళయాక, ఉద్యోగం చెయ్యాలనీ, మానకూడదనీ అన్నారు కదా" ?

"అవును ... అయితే ..."

"అందుకే ఉద్యోగం మాన లేదు ...ఉద్యోగం చెయ్య మన్నారే కానీ ... జీతం మీకిమ్మని ముందే కండిషను పెట్ట లేదు కదండీ "

సునంద మాటలతో ఆ యింట్లో అంతా నిర్ఘాంత పోయారు.వాళ్ళకి కోపం తన్నుకొచ్చినా, ఎలా వ్యక్తం చేయాలో తెలీక ... మిన్నకుండి పోయేరు.ఆ విస్ఫోటనం మరింత పెద్దది చెయ్యడం యిష్టం లేక .... సునంద మళ్ళీ అంది ..."ఈ పరిస్థితులు కొంత కాలమే లెండి .....మా నాన్న మన పెళ్ళికి చేసిన అప్పులు తీరే వరకూ ... ప్లీజ్ ...అర్ధం చేసుకోరూ ..." అని.


కట్న ప్రసక్తి లేకుండా కోడల్ని తెచ్చుకున్న వారిగా అందరి మెప్పూ పొందిన ఆ యింట్లో ఎవరికీ ఆ మాటలతో మరింక నోళ్ళు పెగల లేదు...

ఎంతయినా ... వారిది సంస్కారవంతుల కుటుంబం కదా ? ......


* * * * * * *


నవ్య సచిత్ర వార పత్రికలో తే 9-9-2009 దీ సంచికలో ప్రచురణ.

1, ఫిబ్రవరి 2016, సోమవారం

నల్ల దుప్పటి

నల్ల దుప్పటి
కథ
పంతుల జోగారావు


బ్రాండెడ్ వస్తువులకీ, బట్టలకీ కట్టి ఉండే అట్ట ముక్కలా, భయం మాధవరావు వెన్నెముకను ఎప్పుడూ పట్టుకొని వేళ్ళాడుతూ  ఉంటుంది. ధరల వివరాలూ, కంపెనీ  వివరాలూ ఉండే ఆ అట్ట ముక్కలను తీసి పారెయ్య వచ్చునేమో కానీ, మాధవరావు మనసు లోనుండి భయాన్ని అతని తల్లిదండ్రులుకానీ, గురువులు కానీ, చివరకి అతని స్నేహితులు కానీ తొలిగించ లేక పోయారు.
భయ పడడానికే పుట్టినట్టుగా ఉంటాడు. వాడి వొంట్లో రక్తమే ప్రవహిస్తోందో, పిరికి తనమే పారుతోందో చెప్పడం కష్టం.
అలాంటి మాధవరావు జీవితంలో మొన్న మాఘమాసంలో ప్రవేశించింది లలిత. అసలు ముందు పెళ్ళొద్దని గింజు కున్నాడు మాధవరావు
కట్నం చాల లేదా , అంటే కాదు పొమ్మన్నాడు.  పిల్ల నచ్చ లేదా అంటే అదీ కాదన్నాడు.
ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్ళేమిటని గిలగిలలాడి పోయేడు.
‘‘ అది కాదురా నాయనా ! పెళ్ళి కాగానే హైదరాబాదులో నీకో ద్యోగం వేయించి పెడతానని మీ మామగారు గట్టిగా చెబుతున్నారు కదా !’’ అన్నాడు తండ్రి.
‘‘ అవును కదా ’’ అంటూ వంతపాడింది తల్లి. ‘‘భలే ఛాన్సురా నీది !’’ అంది చెల్లి.
‘‘ఇంకేం సంకటం !’’ అని గొణిగింది బామ్మ.
అయినా తలూప లేదు మాధవరావు. కేవలం బీకాం పాసయిన తనకు ఏ  మహానుభావుడూమంచి ఉద్యోగం వేయించ గలడనే భ్రమలు అతనికి లేవు.
‘‘ అక్కడ నువ్వు నిల దొక్కు కునే వరకూ మీ మామగారు సాయం చేస్తారు. నేనూ కావాలంటే ఓ చెయ్యి వేస్తాను’’ భరోసా యిచ్చేడు తండ్రి,  ‘‘అవును కదా !’’ వంత పాడింది తల్లి.
‘‘హాయిగా మహానగరంలో నువ్వూ వదినా జల్సా చెయ్యొచ్చు కదురా అన్నయ్యా ’’ అంది చెల్లి.  ‘‘ఇంకేఁవిటి తెగులు !’’ అని కోప్పడింది బామ్మ  .ఏం చెప్పాలో తెలియ లేదు మాధవరావుకి.
అసలే భయస్థుడైన మాధవ రావుకి మహా నగరంలో జీవిత మంటే యరింత భయం కలగడానికి కారణాలు లేక పోలేదు. గతంలో మహా నగరంలో అతనికి రెండు మూడు సార్లు ఎదురైన చేదు అనుభవాలే అందుకు కారణం.
    ఇంటర్మీడియేట్ పరీక్షలవుతూనే, ఒకరిద్దరు  స్నేహితులతో సరదాగా మహా నగరం చూద్దామని బయలు దేరాడు. తెలిసిన వాళ్ళింట్లో దిగారు. నగరం చూడ్డానికి బయలుదేరారు. వాళ్ళ ఖర్మ కొద్దీ అదే రోజు నగరంలో ఎక్కడో మత కల్లోలాలు మొదలయ్యాయి. అవి నగరమంతా దావానలంలా చుట్టు ముట్టాయి. మిత్రులతో పాటు ఎక్కడో చిక్కుకు పోయేడు మాధవరావు. దిక్కు తోచ లేదు. ఆటోలూ రిక్షాలూ లేవు. బస్సులు నడవడం లేదు. లోకల్ ట్రైన్ల ఊసే లేదు. ఉదయం తిన్న ఇడ్లీ ముక్కలు తప్ప పొద్దుగూకుతున్నా ఎక్కడా తిండీ తిప్పలు దొరక లేదు. దానికి తోడు, బితుకు బితుకుగా తిరుగుతున్న అతన్నీ, అతని స్నేహితులనూ  అనుమానంతో పోలీసులు వేన్లో ఎక్కించుకుని ఎక్కడో నగర శివార్లలో వదిలేసారు. దేవుడి దయవ్లల లాఠీ దెబ్బలు రుచి చూడ లేదంతే. ఆ చీకట్లో దారీ తెన్నూ కానక ఏడుస్తూ, కాళ్ళీడుస్తూ ఎలా వచ్చి పడ్డారో, యింటికి, వాళ్ళకే తెలియదు.
     ఆ అనుభవంతో ఇక జన్మలో మహా నగరం ముఖం చూడ కూడదని నిర్ణయించు కున్నాడు మాధవరావు.
   కానీ మరో సారి ఏదో తెలిసిన వాళ్ళింట్లో పెళ్ళికి తప్పని సరిగా రెండో సారి మహా నగరానికి వెళ్ళ వలసి వచ్చింది మాధవరావుకి. సరిగ్గా అప్పుడే నగరంలో పలు ప్రాంతాల్లో బాంబు దాడుల విధ్వంసం జరిగింది. కూత వేటు దూరంలో చావు తప్పించు కుని బతికి బట్ట కట్టాడు మాధవరావు. దీనితో అతని భయం ఘనీభవించింది. ఇక్కడికి రావడం ఇదే చివరిసారి ... అని తీర్మానించు కున్నాడు.
       ఏది వద్దను కున్నాడో అదే జరిగేలా ఉంది ... ...

     ‘‘ మహా నగర మన్నాక, అదంతా మామ్మూలే. అనేక రకాల మనుషులుంటారు.వేరు వేరు మతాల వాళ్ళుంటారు. సవాలక్ష సమస్యలుంటాయి. ఎప్పుడో ఏదో జరుగుతందని భయ పడి అక్కడికి వెళ్ళనంటే ఎలారా ? మన ఊళ్ళో చెరువు గట్టున  చెట్టు కొమ్మలకు వేళ్ళాడేరుషి పక్షిలా  ఎంత కాలం ఉన్నా ఎదుగా ? బొదుగా ?  వచ్చిన అవకాశాన్ని పిచ్చి భయాలతో కాలదన్నుకోకు’’ అని హితవు పలికేడు చిన్ననాటి స్నేహితుడొకడు.
‘‘ చిన్న వాడివయినా చక్కగా చెప్పావయ్యా !’’ అని మెచ్చు కున్నాడు తండ్రి,
‘‘ కదా, మరి ’’ అని తలూపింది తల్లి. ‘‘ సిరిరా మోకాలొడ్డకురా అన్నయ్యా ’’ తెలిసిన పాండిత్యం ఒలకబోసింది చెల్లి. ‘‘ మరేఁవిటి పోయే కాలం !’’ అంది బామ్మ.
ఆ చక్రవ్యూహం నుండి ఎలా బయట పడాలో తెలిసే లోపలే మాధవరావు పెళ్ళి లలితతో జరిగి పోయింది.
   మామగారు ఇచ్చిన మాట నిలబెట్టు కున్నారు. కూతురూ అల్లుడి చేత మహా నగరంలో ఓ చిన్న ఇల్లు తక్కువ లో అద్దెకి సంపాదించి వాళ్ళ చేత కొత్త కాపురం పెట్టించాడు. మాధవరావుకి ఓ చిట్ ఫండ్ కంపెనీలో చిన్న ఉద్యోగం వేయించాడు. హాయిగా బతకండని దీవించి  ఊరెళ్ళి పోయాడు.
    ఉద్యోగం చేసే చోటుకి వెళ్ళాలంటే మాధవరావు రెండు బస్సులు మారాలి. భయం భయంగా మొదలయిన  కాపురం లలిత చొరవతో కొంత గాడిన పడింది.
‘‘ మీవన్నీ లేని పోని భయాలు. అందరం మనుషులమే. అందరికీ సాఫీగానే  బతకాకాలనుంటుంది.  ఎవరికీ గొడవ లక్కర లేదు.గొడవలు పడే వారి శాతం తక్కువగానే ఉంటుంది. మంచీ చెడూ చీకటీ వెల్తురూ లాంటివి, చెడ్డనే చూస్తూ కూచో కూడదు. మంచినీ చూడాలి. అప్పుడీ లోకం అంతా పచ్చ పచ్చగా కనిపిస్తుంది. మన పల్లెల్లో లేవూ, క్షలూ కార్ఫణ్యాలూ ? మనం బతకడం లేదూ? ’’ అని తోచిన మాటలు చెస్పి ధైర్యం నూరి పోసేది.
క్రమేపీ మాధవరావు నగర జీవితానికి అలవాటు పడ్డాడనే చెప్పాలి. రోజూ రెండు బస్సులు మారి ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాడు. భార్యని సినియాలకీ, షికార్లకీ తిప్పుతున్నాడు.
     అంతా బాగానే ఉంది.

XXX             XXXX                      XXXX                        XXXX                                    

అంతా బాగానే ఉందంటే, మాధవరావుకి సంబంధించినంత వరకూ, మరీ అంత బాగా
 లేదేమో !
ఆఫీసులో మాధవరావు ప్రక్క సీటు రామారావుది. అనకాపల్లి నుండి వచ్చేడు. మాధవరావులోని పిరికితనాన్ని కనిపెట్టి  అతనితో ఆడుకోవడం మొదలు పెట్టాడు. మహా నగరంలో తను ఎదర్కొన్న చేదు అనుభవాలను గురించి చిలవలు పలవలుగా కథలు అల్లి అతన్ని భయ పెట్టాడు. సాటి మనిషి బలహీనతతో ఆడుకోవడంలో మజానీ. పైశాచిక ఆనందాన్నీ అనుభవించేడు. ఇప్పుడిప్పుడే విడివడుతున్న భయాల తెరలు తిరిగి నీలి నీడల్లా కమ్ముకోడం మొదలెట్టాయి మాధవరావుకి,
  రామారావు చెప్పినదంతా భార్య లలితకు చెప్పి‘‘ చూసావా ! నే చెప్ప లేదూ ? ఇక్కడ మనలాంటి వాళ్ళం బతకడం కష్టం. మన ఊరు పోదాం ’’ అనే వాడు. లలిత ధైర్యం చెప్పేది. రామారావు మనస్తత్వాన్ని విశ్లేషించి వివరించేది. ‘‘ అలాగయితే అతను మాత్రం ఇక్కడెందుకు ఉంటున్నాడూ ? అనకాపల్లి తిరిగి వెళ్ళి పోవచ్చు కదా !’’ అని లాజిక్కు తీసేది. భార్య మాటలు సబవుగా తోచి అప్పటికి స్తిమిత పడే వాడు మాధవరావు.

XXX                                  XXXX                       XXXX                                XXXX

 ఇటీవల మాధవరావుకి ఓ కొత్త నేస్తం తటస్థపడ్డాడు. నేస్తమంటే నేస్తం కాదు. తమ ఊరి వాడే. పెద్ద పెద్ద మీసాల గంగయ్య.బవిరి గెడ్డం. చురుకైన చూపులూ. భారీకాయం. చూడగానే తంతాడు కాబోలు అనిపించేలా ఉంటాడు. వాడి ఆకారం ఎలా ఉన్నా, తమ ఊరి వాడే కావడం వల్ల, మంచికీ చెడుకీ ఆసరాగా ఉంటాడనే ఊహతో మాధవరావు అతనికి చేరువయ్యాడు.
      గంగయ్యకి మాధవరావు రెండో బస్సు ఎక్కే చోట వారగా చెట్టు కింద ఓ టీ దుకాణం ఉంది. సిటీ బస్సులు ఆగే చోటుకి దగ్గరగా ఉంది. నాలుగు కర్రలు నిలబెట్టి దాని మీద ఓ దళసరి  పాత నల్ల దుప్పటీ ఎండ తగలకుండా ఉండడం కోసం కట్టి ఉంటుంది. మాధవరావు బస్సు దిగి, గంగయ్యతో మాటలు కలిపి. ఆమాటా ఈ మాటా మాట్లాడి, టీ త్రాగి రెండో బస్సు ఎక్కి ఆఫీసుకి వెళ్తాడు.ఇదో అలవాటుగా మారింది అతనికి.
    గంగయ్యతో పరిచయం అనవసరంగా పెట్టు కున్నాని మాధవరావు భయపడి పోతూ అనుకునే రోజు త్వరలోనే వచ్చింది. గంగయ్య తన టీ కొట్టులో ఎండ తగలకుండా కట్టిన పాత నల్ల దుప్పటి ఓ రోజు మాయమైంది. దాన్ని అక్కడి కొచ్చే నరిసింగే తీసి  పట్టుకుపోయి ఉంటాడని గంగయ్య అనుమానం.
‘‘ ఆడి పనే బావూ, యిది ... దొంగ కళ్ళూఆడూనూ ... ఆడి చూపు నా దుప్పటీ మీదే ఉండేది. పేదోడే. .. కాదన్ను ... కానీ నన్నడక్కండ ఎత్తుకెళి పోతే ఊరుకుంతానేటి ?ఆడి గుడిసెలో అది కనబడాల .. ఆడిని కసాపిసా పొడిసి పోగులెట్టేస్తాను. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చే టప్పుడు రా మాధవరావుబావూ, ఆడి గుడిసెకాడి కెళ్ళి సూద్దాం..నువ్వే సాచ్చీకం.. ఆడో, నేనో తేలిపోవాల !’’ మహా ఉద్రేకంగా ఉన్నాడు గంగయ్య.
  మాధవరావు గుండె జారి పోయింది. భయం అతడి శరీరమంతా చీకటిలా పరచుకుంది. ఎరక్క పోయి ఇరుక్కున్నాననుకున్నాడు. ఈ గంగయ్య అన్నంత పనీ చేసేలా ఉన్నాడు. వీడితో చనువు పెంచుకుని అనవసరంగావీళ్ళ గొడవల్లో తాను ఇరుక్కు పోయేలా ఉన్నానని తెగ భయ పడి పోసాగాడు మాధవ రావు ... నరిసింగు కూడా తక్కువ వాడేం కాదు .. ఏం గొడవ లొస్తాయో, ఏఁవిటో కర్మ .. మాధవరావు భయంతో పది లంఖణాలు చేసిన వాడిలా తయారయ్యాడు. ఆ రోజు నుంచీ, ఆఫీసుకి వెళ్ళేటప్పుడూ. వచ్చేటప్పుడూ బస్సులు మారే వేళ గంగయ్య కంట పడకుండా తప్పించుకుని తిరగడం మొదలెట్టాడు. బస్టాపు గంగయ్య టీ కొట్టుకి ఎదురుగానే ఉంటుంది. తప్పించు కోవడం ఎన్నాళ్ళు కుదురుతుంది ? దొరికి పోయేడు  -మాధవరావు. గంగయ్య కంట్లో పడనే పడ్డాడు. ‘‘ బావూ, ఆయేళ, నరిసింగు గుడిసెకి ఎళదాం రమ్మన్నానుకానా ? రానేదేటి ? నీ కోసం సూసి సూసి నానే,  ఒక్కడ్నే ఆడి గుడిసెకి ఎళ్ళి చూసొచ్చాను. అదాడి పనే ... నా నల్ల దుప్పటీ ఆడింట్లోనే ఉంది .. నాను సెప్పనేదా !’’ అంటున్నాడు గంగయ్య.  భయాల కొండ గుండె మీంచి దిగి పోయినట్టు స్తిమిత పడ్డాడు మాధవరావు. ‘‘ దొంగ వెధవ ! ఏం చేసావేమిటి వాడిని ?’’  సగటు మనిషి కి సహజమైన కుతూహలంతో అడిగేడు మాధవరావు.
   ‘‘ నా నల్ల దుప్పటీఆడి గుడిసెలోకనిపిస్తే ఆడ్ని నరికి పోగులెడదాఁవనే బస్సు చార్జీలు ఎట్టుకుని మరీ ఎళ్ళాను బాబూ .. కానీ , అదాడి దగ్గరే వొగ్గీసి వొచ్చీసినాను. మరో గుడ్డ ముక్క సాంపాదించుకో లేనంత దరిద్రంలో  నాను లేను కదా ...’’
‘‘ అదేం అలా చేసావు !’’   ఆశ్చర్యంగా అడిగేడు మాధవరావు. ఇలా అడగడంలో సిగ్గు లేని తనంఅతనకి చాలా సేపటి వరకూ తట్ట లేదు.
   ‘‘నిజిఁవే బావూ ... కానీ ..నా బడ్డీ కాడి నుంచి ఆడెత్తుకెళ్ళిన దుప్పటీ ఆడో, ఆడి పెళ్ళామో వాడుకుంటూ ఉంటే ఆపనే సేద్దును ... కానీ, ... దాన్ని ఆళ్ళు ముసిలోడికి కప్పేరు ... ముసిలోడు ఇవాళో రేపో కునికీసీలా ఉన్నాడు ...’’ గంగయ్య జాలిగా చెప్పేడు.
  ఒక మంచు తెర మాధవరావు ముఖానికి ఛెళ్ మని వచ్చి తాకినట్టయింది.
అవును కదా ! మారు మూల పల్లె అయినా, మహా నగర మయినా ఉండేది మనుషులే
 కదా ! మనుషులంటూ  ఉన్నాక, వారి గుప్పెడంత గుండెల్లో పిడికిడంత   మంచినం. మానత్వం ఉండక పోతాయా !
మాధవ రావు మనసు ఇప్పుడు బాగా తేట పడింది.  అతనిలో భయాల మంచు కొండ కరిగిపోసాగింది ! అతని  గుండె లోతులోని చీకట్లను  చీల్చుకుని వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి !
                                                   XXX